బెల్లంపల్లి, వెలుగు : జోనల్ స్థాయి క్రీడలు స్ఫూర్తిదాయకమని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ (సీఓఈ) లో జోనల్ స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా అడిషనల్ కలెక్టర్ బి. రాహుల్, సంక్షేమ గురుకులాల ఓఎస్డీ రమణారావుతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, జాతీయ జెండా ఆవిష్కరించి పోటీలు ప్రారంభించారు. కాళేశ్వరం జోన్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి, కొమురంభీం (ఆసిఫాబాద్), భూపాలపల్లి జిల్లాలకు చెందిన 1200 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమిని స్ఫూర్తి గా తీసుకొని గెలుపు కోసం ప్రతి ఒక్క క్రీడాకారుడు పోరాడాలని సూచించారు. బెల్లంపల్లి సీఓఈ ఉత్తమ బోధన ద్వారా ఫలితాల సాధనలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. స్కూల్ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, స్టాఫ్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ పోటీలు ఈ నెల 16 వరకు కొనసాగుతాయని ప్రిన్సిపాల్ సైదులు చెప్పారు. మొదటిరోజు వాలీబాల్, అథ్లెటిక్స్, హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి.
కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య, తహసీల్దార్ బి.సుధాకర్, ఎంఈఓ పి. మహేశ్వర్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆర్.తిరుపతిరెడ్డి, జోనల్ గేమ్స్ ఓవరాల్ ఇన్ చార్జి దాసరి ప్రసాద్, ఆదిలాబాద్ జిల్లా డీసీఓ సంగనబట్ల శ్రీనివాస్, ప్రిన్సిపాల్స్ లలిత కుమారి, పి.జ్యోతి, సంధ్యారాణి, ఊటూరి సంతోష్, ఊటురి శ్రీనాద్ తదితరులు పాల్గొన్నారు.