
అచ్చంపేట, వెలుగు: ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. మంగళవారం లింగాల మండలం అప్పాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నల్లమలలోని అప్పాపూర్, ఆగర్ల పెంట, రాంపూర్, మేడిమొల్కల, ఈర్లపెంట గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.59 లక్షలు కేటాయించిందని తెలిపారు. సోలార్ లైటింగ్, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని, రూ.10 లక్షలతో చెక్ డ్యాం నిర్మాణం, రూ.15 లక్షలతో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గవర్నర్ ఈ నెలలో చెంచుపెంటల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.
బౌరాపుర్ జాతరను వైభవంగా నిర్వహించాలి..
బౌరాపూర్ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి జాతరను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. చెంచుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని కలెక్టర్ దర్శించుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ తెలిపారు. డీఎఫ్వో రోహిత్ గోపిడి, డీటీడబ్ల్యూవో ఫిరంగి, డీఆర్డీవో చిన్న ఓబులేషు, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, ఆర్డీవో మాధవి, డీఎస్పీ శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారులు సుధాకర్ సింగ్,హేమలత, తహసీల్దార్ పాండు నాయక్ పాల్గొన్నారు.