
అమ్రాబాద్, వెలుగు :ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం ఉదయం టన్నెల్ వద్దకు చేరుకున్న ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఆలీ, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ ఆఫీసర్ ప్రసన్న, హైడ్రా, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎస్డీఆర్ఎఫ్ ఆఫీసర్, ఫైర్ సర్వీసెస్, సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కన్వేయర్ బెల్ట్ రిపేర్‌ను పనులు వేగవంతం చేసి ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
డీ- వాటరింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందన్నారు. నిపుణుల పర్యవేక్షణలో టన్నెల్లో మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినయోగించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. టన్నెల్లోకి పై నుంచి, ఇరువైపుల నుంచి నీరు రాకుండా.. ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని తొలగించే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ఇందుకు ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన యంత్రాలు నిరంతరం పని చేస్తున్నాయని వివరించారు. కాగా.. ప్రమాద ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యలకు ఎదురవుతున్న సమస్యలపై అరవింద్ కుమార్ విశ్లేషించారు.