నస్పూర్ లో యాసంగి సాగుకు నీటిని విడుదల చేస్తాం : బదావత్ సంతోష్

నస్పూర్ లో యాసంగి సాగుకు నీటిని విడుదల చేస్తాం :  బదావత్ సంతోష్

నస్పూర్, వెలుగు: యాసంగి పంటల సాగుకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి సాగునీటిని విడుదల చేస్తామని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో కలిసి నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, తహసీల్దార్లు, రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యాసంగి పంటల సాగు కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లోని దాదాపు 15 వేల ఎకరాల ఆయకట్టుకు ఈ నెల 6 నుంచి సాగునీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేసి, ఏప్రిల్ 15 వరకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీఓ రాములు, గూడెం ఎత్తపోతల పథకం ఈఈ దశరథం, ఎల్లంపల్లి ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ బుచ్చిబాబు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కాంతయ్య, సంబంధిత ఆఫీసర్లు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ ద్వారా నిరంతరం తాగునీరు

మిషన్ భగీరథ ద్వారా నిరంతరం శుద్ధమైన తాగునీటి సరఫరా చేపట్టనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎలాంటి అంతరాయం లేకుండా మిషన్​భగీరథ నీటిని సరఫరా చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆఫీసర్లను ఆదేశించారు. పైప్ లైన్ల లీకేజీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.