
- రేపటి నుంచి జనవరి 6 వరకు నిర్వహణ
- ప్రతి మండలంలో రోజుకు నాలుగు సభలు
- 172 మున్సిపల్ వార్డుల్లో టీమ్‌ల ఏర్పాటు
- ఆరు గ్యారంటీలతో అప్లికేషన్ ఫారం ఇస్తాం
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ప్రజాపాలన గ్రామసభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బదావత్సంతోష్ తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు సభలు జరుగుతాయన్నారు. ‘‘ప్రజాపాలన ద్వారా అర్హత గల ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జవాబుదారీతనం, పారదర్శకతతో క్షేత్రస్థాయిలో పథకాలను అమలు చేస్తాం. ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారతలను చేకూర్చడమే సర్కారు ధ్యేయం” అన్నారు. గ్రామసభల నిర్వహణపై మంగళవారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. ప్రజా పాలన, సభల నిర్వహణ ఆయన మాటల్లోనే..
వంద మందికి ఒక కౌంటర్..
ప్రతి గ్రామంలో, మున్సిపల్వార్డులో 100 మందికి ఒక కౌంటర్ఏర్పాటు చేస్తాం. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు ఉంటాయి. గ్రామసభలకు ముందురోజే టీమ్మెంబర్లుప్రభుత్వ ఆరు గ్యారెంటీలతో కూడిన అప్లికేషన్ ఫారం అందిస్తారు. దరఖాస్తు విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో ఉన్నట్లయితే టోకెన్లు ఇస్తాం. హెల్ప్ డెస్క్ కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. అప్లికేషన్‌తో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జత చేయాలి. రేషన్‌కార్డు లేకుంటే ఆధార్‌కార్డు తప్పనిసరి. దరఖాస్తులు స్వీకరించిన వెంటనే రిసిప్ట్అందిస్తాం. ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర సమస్యలపైనా అప్లికేషన్లు
తీసుకుంటాం.
ఇది నిరంతర ప్రక్రియ..
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ. ప్రతి నాలుగు నెలలకోసారి గ్రామ, వార్డు సభలు జరుగుతాయి. సభల్లో దరఖాస్తు చేసుకోనివారు మిగతా రోజుల్లో ఎప్పుడైనా పంచాయతీ సెక్రటరీలకు, మున్సిపాలిటీల్లో వార్డు ఇన్‌చార్జీలకు అప్లికేషన్లు ఇవ్వొచ్చు. గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల దగ్గర భద్రపర్చుతాం. సాఫ్ట్వేర్ అందుబాటులోకి రాగానే అప్లికేషన్లను ఆన్లైన్ చేసి ప్రత్యేకంగా నంబర్లు కేటాయిస్తాం. తద్వారా వాటి ప్రోగ్రెస్‌ను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకోవచ్చు.
స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణ
ప్రజాపాలన గ్రామసభలు, దరఖాస్తులను జిల్లా స్థాయిలో కలెక్టర్, ఇద్దరు అడిషనల్కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. అలాగే నియోజకవర్గాలకు నోడల్ఆఫీసర్లను నియమించాం. మంచిర్యాలకు జడ్పీ సీఈవో నరేందర్, చెన్నూర్‌కు డీఆర్డీవో శేషాద్రి, బెల్లంపల్లికి ఆర్డీవో హరికృష్ణ నోడల్ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. ప్రతి మండలానికి జిల్లాస్థాయి అధికారిని స్పెషల్ఆఫీసర్గా నియమించాం. సంబంధిత అధికారులకు, సిబ్బందికి ట్రెయినింగ్ ఇచ్చాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీరు, టెంట్లు, కౌంటర్ల కోసం టేబుళ్లు, క్యూ లైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.20వేల చొప్పున కేటాయించింది. గ్రామసభ జరిగే చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.
మండలానికి రెండు టీమ్‌లు
ప్రతి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవోల ఆధ్వర్యంలో రెండు టీమ్‌లను ఏర్పాటు చేశాం. ఒక్కో టీమ్‌లో పది మంది అధికారులు, సిబ్బంది ఉంటారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక గ్రామంలో, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 6గంటల వరకు మరో గ్రామంలో సభలు నిర్వహిస్తారు. ప్రతి మండలంలో రోజుకు నాలుగు గ్రామసభలు జరుగుతాయి. జిల్లాలో 172 మున్సిపల్వార్డులున్నాయి. ఒక్కో వార్డుకు ఒక్కో టీమ్‌ను ఏర్పాటు చేశాం. వివిధ శాఖల అధికారులను వార్డు ఇన్‌చార్జీలుగా నియమించాం. వారి ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తాం.