ఆదిలాబాద్/ఆసిఫాబాద్, వెలుగు : ఈ నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆయా ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాల ఎన్నికల అధికారులు వెల్లడించారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు చెప్పారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ సురేశ్ కుమార్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు, సిబ్బంది, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆసిఫాబాద్ లో 305, సిర్పూర్ లో 294 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 438 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ అమలు చేస్తున్నామని, ఎన్నికల ప్రారంభానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 290, బోథ్ నియోజకవర్గంలో 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో సిబ్బందిని నియమించామని తెలిపారు. 75 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలు లోనుకాకుండా స్వచ్చంధంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మద్యం, డబ్బుల పంపిణీని అరికట్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగేందుకు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పించామన్నారు. ఒకవేళ ఇంట్లో నుంచి వచ్చే పరిస్థితి లేని వృద్ధులు, దివ్యాంగులను ఆటోల్లో తరలించేందుకు పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో పోలీసు సిబ్బంది చేయాల్సిన విధులు, నియమ నిబంధనలతో కూడిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి అందించామన్నారు.