ఆదివాసులు చదువుల్లో రాణించాలి : కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు

  •     కలెక్టర్ హేమంత్ సహదేవరావు

ఆసిఫాబాద్, వెలుగు : ప్రతి ఆదివాసీ బిడ్డ విద్యనభ్యసించి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఆదివాసీ పటేళ్లు, గోండ్వాన రాయి సెంటర్, సర్ మెడి సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయగా ఎస్పీ సురేశ్ కుమార్​తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఆదివాసీ, గిరిజన బిడ్డ ఉన్నత చదువులు చదవాలని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.

మారుమూల గిరిజన గ్రామాల్లో తాత్కాలిక రహదారుల నిర్మాణం చేపట్టి రాకపోకలు సాగించే విధంగా ఏర్పాట్లు చేస్తామని, గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివాసీ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా కుట్టు మెషీన్ల శిక్షణ, పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వరరావు, గిరిజన సంఘం నాయకులు సిడం అర్జు, కుర్సింగ మోతిరామ్, కుమ్రం మాంతయ్య, సుధాకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్​లో తనిఖీలు  

తిర్యాణి : ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్లో కరెంట్, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని కలెక్టర్​కు ఫిర్యాదులు రావడంతో మంగళవారం ఆ హాస్టల్​ను ఆయన తనిఖీ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ అనంతరాజు, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ ను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ ఆఫీసులో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించేలా అవేర్నెస్ కల్పించాలన్నారు.