ఇసుక, ఒండ్రు మట్టి అక్రమ రవాణాను అరికట్టాలి : సి.నారాయణరెడ్డి

నల్గొండ, అర్బన్ వెలుగు ​: జిల్లాలో ఇసుక, ఒండ్రు మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లొండ కలెక్టరేట్​నుంచి రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో ఇసుక, ఒండ్రు మట్టి, మొరం అక్రమ రవాణా, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక, ఒండ్రు మట్టి అక్రమ రవాణా చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిని అరికట్టేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలో బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందాల్సిన అవసరం ఉందని, ఈ బృందాలు పకడ్బందీగా పనిచేసి అక్రమ రవాణాను అరికట్టాలని చెప్పారు. జిల్లా నుంచి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని చెరువుల నుంచి ఒండ్రుమట్టి అక్రమ రవాణాను తక్షణమే నిలిపివేయాలని, ఇసుక, ఒండ్రు మట్టి అక్రమంగా తరలించే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణల విషయంలో సైతం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించాలి 

జిల్లాలో ప్రాజెక్టులు, పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో భూసేకరణ, పునరావాస కేంద్రాలపై రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకించి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులు ఎక్కడా పెండింగ్ లో ఉండొద్దన్నారు.  ఎన్నికల కోడ్  కారణంగా ఆగిపోయిన పనులన్నింటిని తక్షణమే పూర్తిచేయాల్సిన బాధ్యత ఆర్డీవోలపై ఉందన్నారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఆస్తులను ఆక్రమించినట్లయితే వాటిని తొలగించడమే కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

సీజనల్ వ్యాధులపై దృష్టి సారించండి

వర్షాకాలం ప్రారంభమైనందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్​లోని తన చాంబర్​లో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఏ ఒక్కరూ వ్యాధుల బారినపడకుండా చూడాలన్నారు. ఎక్కడైనా సీజనల్ వ్యాధులు ప్రబలినట్లయితే తక్షణమే ఆయా గ్రామాలకు వెళ్లి చికిత్స అందించాలని సూచించారు.

రోడ్లపై ప్రమాదాలు జరగకుండా నివారించాలి.. 

సాంకేతిక సమస్యలతో ప్రమాదాలు కారణమయ్యే ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని జిల్లా రోడ్డు సేఫ్టీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న జాతీయ రాష్ట్ర రహదారులపై  ప్రమాదాలు నివారించడానికి అవలంభించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు, రోడ్లు, భవనాలు, ఎక్సైజ్, ఆర్టీవో , ఆర్టీసీ  తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆయా సమావేశాల్లో జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.