- కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : సయ్యద్ లతీఫ్ ఉల్లాషా ఖాద్రి ఉర్సు ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఉర్సు ఉత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్సు ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవసరమైన తాగునీరు, శానిటేషన్ వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు.
ఈనెల16న ఉర్సు ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 17న గంధం ఊరేగింపు ఉంటుందని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ సయ్యద్ లతీఫ్ ఉల్లాషా ఖాద్రి ఉర్సు ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి సమయంలో బందోబస్తుకు గార్డులను ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు టి.పూర్ణచంద్ర, జే. శ్రీనివాస్, ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి పాల్గొన్నారు.