మౌలిక సదుపాయాలు కల్పించాలి : కలెక్టర్ సి.నారాయణరెడ్డి

నార్కట్​పల్లి, వెలుగు : రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఆలయ అర్చకులు, దేవస్థానం కమిటీ సభ్యులు కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామికి ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ  కార్యనిర్వహక అధికారి గదిలో కలెక్టర్ ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ముఖ్యంగా చెరువుగట్టుపై ఉన్న రామలింగేశ్వర ఆలయానికి ఏటా నిర్వహించే జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గట్టుపైకి వెల్లే రోడ్డును డబుల్ రోడ్డుగా మారుస్తామని, ఈ మేరకు ప్రఫోజల్స్​ రూపొందించాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు.

అనంతరం  నార్కెట్ పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. సమావేశంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ మహేంద్రకుమార్, ఆలయ ఈవో నవీన్ కుమార్, మండల ప్రత్యేకాధికారి, డీఆర్డీవో నాగిరెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ భూమన్న, ఎంపీడీవో ఉమేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు