నేడు, రేపు స్పెషల్​ శానిటేషన్​ డ్రైవ్​ : కలెక్టర్ సి.నారాయణరెడ్డి

  •     ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రంగా ఉండాలి
  •     నల్గొండ కలెక్టర్ నారాయణరెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు :  జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బుధ, గురువారాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక శానిటేషన్  డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని జిల్లా కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారుతోపాటు సిబ్బందిపై ఉందన్నారు. కలెక్టరేట్​లోని అన్ని కారిడార్లు శుభ్రంగా ఉంచాలని, కార్యాలయంలో బూజు, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేయాలని చెప్పారు.

కార్యాలయాల ఆవరణలో కలుపు మొక్కలు పెరగకుండా చూసుకోవాలని, రూఫ్ పై సైతం ఎలాంటి మొక్కలు, చెత్తాచెదారం ఉండకూడదని సూచించారు. రెండు రోజులపాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. టాయిలెట్లలో నిరంతరం నీరు, విద్యుత్ సరఫరా ఉండాలని, అవసరమైతే తక్షణమే మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. శనివారం నాటికి అన్ని కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వచ్చే సోమవారం జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమం అనంతరం తనతోపాటు అడిషనల్ కలెక్టర్లు అన్ని కార్యాలయాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. టెలికాన్ఫరెన్స్​లో అడిషనల్ కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి డి.రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులు, ఆయా విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.