నల్గొండ అర్బన్, వెలుగు : ఈనెల 3 నుంచి కుటుంబ డిజిటల్ కార్డు కోసం పైలట్ సర్వే ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడించారు. బుధవారం నల్గొండలోని ఉదయాదిత్య భవన్ లో సర్వే బృందాల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటుంబ డిజిటల్ కార్డు అమలు చేస్తున్న రాష్ట్రాలలో రాష్ట్రస్థాయి సీనియర్ అధికారుల బృందాలు అధ్యయనం చేశాయని తెలిపారు.
జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మున్సిపల్ వార్డు, గ్రామ పంచాయతీ లో పైలట్ పద్ధతిన సర్వే ప్రారంభిస్తారన్నారు. కార్డు సర్వే లో భాగంగా ముందుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక చిన్న మున్సిపల్ వార్డు,అలాగే చిన్న గ్రామాన్ని ఎంపిక చేయడం చేసినట్టు తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు సర్వేను ప్రారంభించి ఈ నెల 7 లోపు సర్వేను పూర్తిచేసి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంస్థల టీ. పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి ,గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్ పాల్గొన్నారు.