ప్రభుత్వ ఆస్పత్రులపై ఫిర్యాదులకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ : కలెక్టర్ సి.నారాయణరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులపై వచ్చే ఫిర్యాదులకు కలెక్టరేట్​లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నల్గొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్​సీల్లోని డాక్టర్లు, సిబ్బంది ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. రోగుల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురుషులు, మహిళ వార్డులు, ల్యాబ్, ఎమర్జెన్సీ వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. 

గడిచిన వారం రోజుల నివేదిక ఆధారంగా ఏఏ మండలాల నుంచి జ్వరపీడితులు  ఎక్కువగా  వస్తున్నారో  సమర్పించాలని  ఆస్పత్రి సూపరింటెండెంట్ రమణ కుమార్ ను ఆదేశించారు. ఆస్పత్రిలో మందులు సరిపడా ఉన్నాయా? ఫ్లూయిడ్స్ , ఆంటీ బయోటిక్స్ ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ, చికెన్ గున్యా కేసుల వివరాలను ఆరా తీశారు. ల్యాబ్ ద్వారా నిర్వహించే టెస్టుల్లో  ఎలాంటి తప్పులు లేకుండా ఉండాలని  కలెక్టర్ ఆదేశించారు. టీ- హబ్ నిర్వాహకులు, ల్యాబ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ ను  ఆయన ఆదేశించారు.