నల్గొండ అర్బన్, వెలుగు : ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేశ్ ఉత్సవ కమిటీ, పీస్ కమిటీ సభ్యులు ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. అధికారులు ప్రతి మండపానికి వెళ్లి తనిఖీ చేసి విద్యుత్ కనెక్షన్ అనుమతులు ఇవ్వాలన్నారు.
గణేశ్ నిమజ్జనం చేసే చోట గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. అందరూ మట్టి వినాయకులను ఉపయోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాల సందర్భంగా పోలీసుశాఖ తరపున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏమైనా సంఘటనలు జరిగితే వెంటనే డయల్100 నంబర్ కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
ప్రతి మండపానికి ఒక కానిస్టేబుల్ ను కేటాయిస్తామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు టి.పూర్ణచంద్ర, జె.శ్రీనివాస్, డీఎఫ్ వో రాజశేఖర్, పీస్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ హఫీజ్ ఖాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోలి మధుసూదన్‌రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు ఖలీల్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు విజయకుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.