నల్గొండ అర్బన్, వెలుగు : 85 ఏండ్లు నిండిన వయోవృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని కల్పించిందని, అర్హులైనవారు సాక్ష్యం యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ 45 శాతానికి మించి వికలత్వం ఉన్న దివ్యాంగులు
పోలింగ్ కేంద్రానికి రాలేని పరిస్థితుల్లో ఉంటే హోమ్ ఓటింగ్ విధానానికి సాక్ష్యం యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఫారం 12–- డీ లో సైతం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జిల్లాలోని దివ్యాంగులందరూ ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు.
ట్రాన్స్ జెండర్లు తమ ఓటు వేయడమే కాకుండా, ఓటింగ్ పై ఇతరులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ అధికారి రాజ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ సక్కుబాయి, ట్రాన్స్ జెండర్స్ తదితరులు పాల్గొన్నారు.