ఇందిరమ్మ ఇండ్ల వివరాల్లో పొరపాట్లు చేయొద్దు :కలెక్టర్ దివాకర టీఎస్

ములుగు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల అర్హులను గుర్తించడంలో  పొరపాట్లు చేయొద్దని  కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌‌లో అదనపు కలెక్టర్ (ఇంచార్జ్) సంపత్ రావు తో కలిసి జిల్లాలోని తహసీల్దార్లు,  ఎంపీడీవోలు, ఎంపీఓలు, జీపీ కార్యదర్శులకు పవర్ పాయింట్​ ప్రజెంటేషన్ నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో ఇండ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్ల వద్దకు వెళ్లి ఇంటి స్థలాన్ని పరిశీలించి ధ్రువీకరణ పత్రాలను, లబ్ధిదారుల ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ వివరాలను సేకరించాలని సూచించారు.

లబ్ధిదారులు ఇండ్ల వద్ద లేనిపక్షంలో వలస వెళ్లిన వారికి సెల్ ఫోన్ ద్వారా వివరాలను సేకరించాలన్నారు. నిర్దేశించిన గడువులోగా వివరాలను సేకరించాలని, ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిచేయాలని అన్నారు. సేకరించిన వివరాలను వెంటనే ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేయాలని, ఏమైనా సమస్యలు తలెత్తితే  డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.