ఏటూరునాగారం, వెలుగు: దట్టమైన అటవీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పూర్తి చేసి, మెరుగైన సేవలు అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ములుగు కలెక్టర్ దివాకర అన్నారు. గురువారం జిల్లాలోని ఏటూరునాగారం, కొండాయి మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలైన ఐలాపూర్, కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి, ఆయా గ్రామాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కొండాయిలో సమ్మక్క సారక్క వనదేవతలను దర్శించుకోగా, పూజారి కాక వెంకటేశ్వర్లు గిరిజన సాంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించారు. గిరిజన గ్రామాల ప్రజలకు కోసం ప్రత్యేక అంబులెన్స్ 24 గంటలు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ నెల 12 నుంచి కొండాయిలో జరిగే మినీ మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తామని వివరించారు.
ఐలాపురంలో పర్యటించి ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరిగే ఐలాపురం సమ్మక్క సారలమ్మ మహాజాతర పోస్టర్లను ఆలయ పూజారులు, వడండ్డెలతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం తాడ్వాయి మండలంలో గవర్నర్ దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామాన్ని సందర్శించారు. కలెక్టర్వెంట ట్రైబల్ వెల్ఫేర్ఈఈ వీరభద్రం తదితరులున్నారు.