భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం అగ్రికల్చర్ ఆఫీసర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందోద్దన్నారు. జిల్లాలో 2,16,625 ఎకరాల్లో పత్తి సాగవుతోందని, దీనికి 5,41,560 ప్యాకెట్లు అవసరం ఉందని, వరి సాగు 1,65,854 ఎకరాలకు గానూ 41,464క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉందని తెలిపారు.
మొక్కజొన్న సాగు 60,200 ఎకరాల్లో జరుగనుందని, ఇందుకు అవసరమైన 4,816క్వింటాళ్ల విత్తనాలు, మిర్చి సాగు 32,168 ఎకరాలకు అవసరమైన 32క్వింటాళ్ల విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జిల్లాకు ఇప్పటి వరకు 2,47,044 ప్యాకెట్ల పత్తి విత్తనాలు రాగా, 29,130 ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారని చెప్పారు. .జీలుగ, జనుము, పిల్లిపెసర అందుబాటులో ఉన్నాయన్నారు. డీలర్లు నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అమ్మాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ బాబూరావు, ఏడీఏ రవికుమార్ పాల్గొన్నారు.
వ్యాధుల పట్ల అలర్ట్‌గా ఉండాలి
వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వైద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్‌జైన్‌తో కలిసి కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్యశాఖాధికారులు, పంచాయతీ, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల అలర్ట్‌గా ఉండాలని సూచించారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
ప్రతి హాస్పిటల్, క్లీనిక్, డయాగ్నోస్టిక్ సెంటర్లు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతీ హాస్పిటల్లో ఐపీ, ఓపీ, ఓటీ, రిజిస్టర్స్, కేస్ షీట్స్ మెయింటెనెన్స్ చేయాలని చెప్పారు. మూడు నెలలకోసారి డీఎంహెచ్‌వోకు నమోదైన వ్యాధుల వివరాలను అందించాలన్నారు. జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కమిటీ జిల్లా స్థాయిలో ప్రతీ హాస్పిటల్‌ను సందర్శించి నిబంధనల ప్రకారంగా అన్ని ఉన్నాయో లేదో చూడాలని చెప్పారు. హాస్పిటల్లో ఫైర్ సెఫ్టీ నిబంధనలు పాటించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో డీఎంహెచ్‌వో డాక్టర్ శిరీష, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, వైద్యాధికారులు డాక్టర్ సుకృత, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
బుక్స్ రెడీగా ఉంచాలి
స్కూళ్లు తెరిచే సమయానికి స్టూడెంట్స్‌కు బుక్స్ ఇచ్చేందుకు అన్ని రెడీ చేయాలని కలెక్టర్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కొత్తగూడెం పట్టణం పాత కొత్తగూడెంలో గల పాఠ్యపుస్తకాల గోడౌన్‌ను ఆమె బుధవారం సందర్శించారు. మండల కేంద్రాలకు బుక్స్ పంపిణీని ఆమె ప్రారంభించారు. మొత్తం 4,46,280 పాఠ్యపుస్తకాలను మండల కేంద్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో డీఈవో ఎం. వెంకటేశ్వరాచారి, విద్యాశాఖ కో ఆర్డినేటర్లు ఎ. నాగరాజశేఖర్, ఎస్కె. సైదులు, ఎంఈవో జుంకీలాల్, బుక్స్ గోడౌన్ ఇన్చార్జి రవి ప్రతాప్ పాల్గొన్నారు.