నీటి కొరత రాకుండా ముందస్తు ప్లాన్

  • మండల అధికారులకు కలెక్టర్ ప్రియాంక ఆదేశం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎండా కాలంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్దం చేయాలని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల సూచించారు. కలెక్టరేట్​లో ఇరిగేషన్​అధికారులతో రివ్యూ చేసిన కలెక్టర్​.. ఎంపీడీఓలు, ఎంపీఓలతో తాగునీటి సమస్యపై వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో వేసవి వల్ల ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని, హాండ్​ బోర్లను రిపేర్​ చేయాలని ఆదేశించారు.

నీటి సరఫరాపై సెక్రటరీలు, స్పెషల్​ ఆఫీసర్లు ఏరోజుకారోజూ రివ్యూ చేయాలన్నారు. గత మూడేండ్లుగా తీవ్ర నీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి అక్కడ సమస్య రాకుండా యాక్షన్​ ప్లాన్​ తయారు చేయాలన్నారు. అవసరమైన చోట వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవాలన్నారు.

మంచినీటి ట్యాంకులను ప్రతినెల 1,11,21 తేదీల్లో శుభ్రం చేయాలన్నారు. పారిశుధ్యంపై శ్రద్ద పెట్టాలని, పార్కులు, గవర్నమెంట్​ ఆఫీస్​లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. డీఆర్​డీఓ విద్యాచందన, జడ్పీ సీఈఓ ప్రసూన రాణి, భగీరథ ఈఈ తిరుమలేశ్, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఎంపీడీఓ ఆఫీసుల్లో  ప్రజాపాలన సేవా సెంటర్లు  

 ఎంపీడీఓ ఆఫీసుల్లో  ప్రజాపాలన సేవా సెంటర్లు  ఏర్పాటు చేయాలని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల  ఆదేశించారు.  సీఎస్​ శాంతి కుమారితో వీడియో కాన్ఫరెన్స్​ అనంతరం జిల్లా ఆఫీసర్లతో మాట్లాడారు.  రూ. 500 గ్యాస్​ సిలెండర్​, 200యూనిట్ల ఉచిత కరెంట్​పై ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్​ చేసిందన్నారు.

ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రెండు స్కీంలు వర్తిస్తాయన్నారు.  ఇంటర్​, టెన్త్​ ఎగ్జామ్స్​ సెంటర్లలోకి ఎవరూ సెల్​ ఫోన్​లు తీసుకెళ్లకూడదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్​ ఫోన్​ తీసుకెళ్లే వారిపై సీరియస్​ యాక్షన్ ఉంటుందన్నారు.