కొడుకును అంగన్వాడిలో చేర్పించిన కలెక్టర్

కొడుకును అంగన్వాడిలో చేర్పించిన కలెక్టర్

కర్నూలు: ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ తాహతుకు మించి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. మాటలు కూడా సరిగా రాని చిన్నారులను తీసుకెళ్లి ఖరీదైన స్కూళ్లలో వేస్తున్నారు. కూలి నాలి చేసే తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఆకాంక్షతో..లక్షలు పెట్టి కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలని ఆశ పడుతున్నారు. అలాంటిది డబ్బున్న వారి పిల్లలు, పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవారి గురించి అస్సలు చెప్పనక్కరేలేదు. అయితే ఇందుకు భిన్నంగా కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు తన 4 ఏళ్ల కొడుకు దివి అర్విన్ ను శుక్రవారం నాడు తన బంగళాకు సమీపంలో ఉండే బుధవారపేటలోని అంగన్ వాడి ప్రీ స్కూల్ లో చేర్పించారు. సామాన్యుడి తరహాలో కొడుకును అంగన్ వాడి కేంద్రంలో చేర్పించిన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అందరికీ ఆదర్శంగా నిలిచారు. 


కర్నూలు నగరం లోని బుధవార పేట అంగన్వాడీ ప్రీ స్కూల్ లో చేరిన దివి ఆర్విన్  కేంద్రంలోని సామాన్యుల పిల్లలందరితో కలసి కూర్చుంటూ.. అక్కడి ఆట వస్తువులతో ఆడుకుంటూ.. రంగులు దిద్దుకుంటూ ఆడుకుంటున్నాడు. మెరుగైన బోధన కోసం విద్యా విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సమూలమైన మార్పులను గురించి తరచూ అధికారులతో సమీక్షించే జిల్లా కలెక్టర్ అంగన్ వాడి కేంద్రాలలో అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలు, విద్యా బోధన తీరుతో సంతృప్తి చెందడమే కాదు.. వాస్తవంలో ఎలా ఉందో స్వయంగా తెలుసుకునేందుకు తన కొడుకునే చేర్పించినట్లు తెలుస్తోంది. 


స్కూల్ లో పిల్లలందరితో సమానంగా పౌష్ఠికాహారం అందించడంతో పాటు విలువలను కూడా నేర్పించాలని ఇటీవల జరిగిన మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారుల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారని అంగన్ వాడి కేంద్రం నిర్వాహకులు, అధికారులు గుర్తు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు  ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసేలా చేసేందుకు కలెక్టర్ తన కుమారుడినే బ్రాండ్ అంబాసిడర్ గా చేశారని విద్యాశాఖ అధికారులు అభిప్రాయ పడ్డారు. ఆర్భాటాలకు దూరంగా.. సామాన్యుడిలా నిరాడంబరంగా ఉండే కలెక్టర్ పి. కోటేశ్వర రావు మాటల్లో కాకుండా చేతల్లో చూపించారని వారు పేర్కొన్నారు. ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ స్వయాన తన కుమారుణ్ణి అంగన్వాడీ కేంద్రంలో చేర్పించడం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కార్పొరేట్ స్కూళ్లలోనే కాదు.. సర్కారీ బడుల్లో చదివితే కూడా రాణించవచ్చనే సందేశాన్ని కలెక్టర్ సమాజానికి ఇచ్చారు. 

 

ఇవి కూడా చదవండి

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కె.లక్ష్మణ్  

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ అంబానీ