మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పట్టణంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు కోసం హాళ్లు, స్ట్రాంగ్ రూమ్స్ సిద్ధం చేయాలని కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఎస్పీ హర్షవర్ధన్ తో కలిసి కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లలో అవసరమైన మార్పులు చేయాల్సి ఉంటే, ఆదివారం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ ఆఫీసర్లు, సిబ్బంది, మీడియా కోసం వేర్వేరుగా ఎంట్రీలు ఏర్పాటు చేయాలని, బారికేడ్లు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ కేంద్రానికి దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్ లు కట్టుదిట్టంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఆర్వోలు అనిల్ కుమార్, నటరాజ్, పీఆర్ ఈఈ నరేందర్, డీఆర్వో జేవీవీ రవికుమార్, ఏఎస్పీ రమణారెడ్డి, డీఈ విష్ణు, ఏఆర్వోలు నాగార్జున, శ్రీనివాస్, బ్రహ్మంగౌడ్ ఉన్నారు.
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
నారాయణపేట: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఓటరు స్లిప్పుల పంపిణీ స్టార్ట్ చేశామని, ఈ నెల 25 వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు. పోలింగ్ కోసం 3 వేల మంది ఉద్యోగులు, సిబ్బందిని వినియోగిస్తుండగా, వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫెసిలిటేషన్ సెంటర్లో మాత్రమే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాల్సి ఉంటుందని, పోలీసులు, డ్రైవర్లు ఇతర అత్యవసర సర్వీసుల వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.
గద్వాలలో రెండు బ్యాలెట్ యూనిట్లు
గద్వాల: గద్వాల నియోజకవర్గంలో 20 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో రెండు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. శుక్రవారం రెండు బ్యాలెట్ యూనిట్ల మొదటి ర్యాండమైజేషన్ ను కలెక్టరేట్ మీటింగ్ హాల్లో పొలిటికల్ లీడర్లు, అభ్యర్థుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 338 యూనిట్లకు బదులుగా 378 బ్యాలెట్ యూనిట్లను కేటాయించినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న బ్యాలెట్ యూనిట్లను ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ కు తరలించినట్లు చెప్పారు. మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసిన తర్వాత సీరియల్ నెంబర్ ప్రకారం బ్యాలెట్ యూనిట్లను అలాట్ చేస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు.
పర్మిషన్ లేకుండా కరపత్రాలు పంచితే కేసులే..
పర్మిషన్ లేకుండా కరపత్రాలు పంచితే కేసులు నమోదు చేస్తామని గద్వాల రిటర్నింగ్ ఆఫీసర్ అపూర్వ్ చౌహాన్ తెలిపారు. ఎన్నికల ఖర్చు, బ్యాంక్ అకౌంట్ నిర్వహణ, ఎన్నికల ఖర్చు నిర్వహణపై పొలిటికల్ లీడర్స్ కు, క్యాండిడేట్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్ నిర్వహణ, ఎన్నికల ఖర్చుకు సంబంధించిన నిబంధనలను పాటించాలన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు విజయభాస్కర్ పాల్గొన్నారు.
ఎన్నికల సామగ్రిని సకాలంలో చేర్చాలి
వనపర్తి : ఎన్నికలకు అవసరమైన సామగ్రిని పోలింగ్ స్టేషన్లకు సకాలంలో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వనపర్తి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం పట్టణ సమీపంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను ఆయన పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి వేగంగా పోలింగ్ సామగ్రి అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కిట్లను క్రాస్ చెక్ చేయాలన్నారు. పోలింగ్ ఏజెంట్ హ్యాండ్ బుక్, స్టేషనరీ కిట్, అడ్రస్ టాగ్స్, పోస్టర్స్, బ్యానర్, అన్ని రకాల ఎలక్షన్ మెటీరియల్ సరిగ్గా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి భోజనం, వాహనాల పార్కింగ్, రవాణాలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఎస్.తిరుపతి రావు, ఆర్డీవో పద్మావతి పాల్గొన్నారు.