మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహిళల అభివృద్ది, సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోందని కలెక్టర్ జి.రవినాయక్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తోందని, భరోసా కోసం షీ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే 40 నుంచి 50 శాతం మహిళా ఉద్యోగులు ఉండడం మంచి పరిణామమన్నారు. అనంతరం వివిధ శాఖల్లో అత్యుత్తమ సేవలందిస్తున్న మహిళా అధికారులు, ఉద్యోగులను కలెక్టర్ సన్మానించారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, జువైనల్ జస్టిస్ బోర్డ్ మెంబర్ గిరిజ, డీఆర్డీవో నరసింహులు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ ఇందిరా, డీసీవో ఏ పద్మ, డీపీఎం నాగవల్లిక, డీఈవో రవీందర్ పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్ల శాతం మరింత పెరగాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కోరారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ గ్రౌండ్లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఓటర్ల చైతన్య కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో భాగంగా రంగోలి, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్83 శాతానికి చేరుకునేలా చూడాలని మహిళా సంఘాలకు సూచించారు. స్వీప్ రాష్ట్ర నోడల్ ఆఫీసర్ భవాని శంకర్, జిల్లా నోడల్ ఆఫీసర్ చిన్న ఓబులేసు, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిశోర్ పాండే, మున్సిపల్ కమిషనర్ నరేశ్ బాబు పాల్గొన్నారు.
మహిళల పాత్ర కీలకం..
అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కుటుంబ భారాన్ని మోసే మహిళలకు ఎవరూ సాటి రారని జిల్లా జడ్జి రాజేశ్ బాబు పేర్కొన్నారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వివిధ రకాలుగా సమాజానికి సేవలందిస్తుందన్నారు. కుటుంబ విలువలను పెంపొందించడంలో మహిళల పాత్ర కీలకమన్నారు. న్యాయమూర్తులు సబిత, శ్రీనిధి, మమత, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రఘునాథరావు, సెక్రటరీ పర్వత్ రెడ్డి పాల్గొన్నారు.
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
వనపర్తి టౌన్, వెలుగు: మహిళలు అన్నిరంగాల్లో సత్తా చాటుతున్నారని అడిషనల్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎం నగేశ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం ముందుకెళ్తుందని చెప్పారు. అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. డీడబ్ల్యూవో లక్ష్మీబాయి, డీఆర్డీవో ఉమాదేవి, డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్ రెడ్డి, డీఎస్సీ నుశిత, డీపీఆర్వో సీతారాం పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి
అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వనపర్తి డీఎంహెచ్ వో జయచంద్ర మోహన్ సూచించారు. గురువారం గవర్నమెంట్ ఆసుపత్రిలో సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చీర్ల కృష్ణ సాగర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం యూనిట్లు తక్కువగా ఉన్నాయని చెప్పిన వెంటనే శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో 30 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందన్నారు. మురళీధర్, హేమవర్ధన్ రెడ్డి, గోనూర్ యాదగిరి, మోహన్, కుమార్, గోపాల్ పాల్గొన్నారు.
గద్వాల టౌన్: మహిళలు హక్కులతో పాటు బాధ్యతలను తెలుసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని న్యాయమూర్తి అనిరోజ్ క్రిస్టియన్ సూచించారు. సీనియర్ సివిల్ జడ్జి గంట కవితా దేవి అధ్యక్షతన కోర్టు ఆవరణలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. అదనపు సీనియర్ సివిల్ జడ్జి ప్రభాకర్, జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్ నాయక్ పాల్గొన్నారు.
మరికల్: తహసీల్దార్ సునీతతో పాటు మహిళా సిబ్బందిని తహసీల్దార్ ఆఫీస్ ఉద్యోగులు శాలువా, పూలమాలలతో సత్కరించి అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఐ శ్రీశైలం, సుధాకర్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ గోపాల్‌రావు పాల్గొన్నారు.