మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఓటరు స్లిప్పుల పంపిణీపై సెక్టోరల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని కలెక్టర్ జి.రవినాయక్ సూచించారు. మంగళవారం ఐడీవోసీ నుంచి సెక్టోరల్ ఆఫీసర్లు, ఏఆర్వోలు, బీఎల్వోలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో బుధవారం నుంచి ఓటరు స్లిప్పులను ఓటర్లకు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 25లోగా స్లిప్పుల పంపిణీని పూర్తి చేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏఆర్వోలు పోలింగ్ కేంద్రాల లే ఔట్లను పంపించాలని ఆదేశించారు.
నారాయణపేట: ఎన్నికల సమయంలో సెక్టోరియల్ అధికారులదే కీలక పాత్ర అని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. ఈవీఎం ట్రైనింగ్లో ఆయన మాట్లాడుతూ సెక్టోరియల్ ఆఫీసర్లు ఈవీఎంలపై అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల రోజు ఎలాంటి సాంకేతిక ఇబ్బంది వచ్చినా వెంటనే పోలింగ్ కేంద్రానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రారంభించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, నారాయణపేట రిటర్నింగ్ ఆఫీసర్ రాంచందర్, డీఆర్డీవో గోపాల్ నాయక్, సెక్టోరియల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.