ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ ల్లో ఈవీఎం యంత్రాల తరలింపు ప్రక్రియను ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ సంజయ్ జి కోల్టే తో కలిసి కలెక్టర్ గౌతమ్ మంగళవారం పరిశీలించారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లకు
సంబంధించిన ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపరిచామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా యంత్రాలను తరలించామని చెప్పారు. ఈవీఎంలకు మూడంచెల పటిష్ట భద్రత కల్పించామన్నారు. సీసీ కెమెరాలు అంతరాయం లేకుండా పనిచేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సహాయ ఎన్నికల అధికారులు ఆదర్శ్ సురభి, బి. సత్యప్రసాద్, వేణుగోపాల్, ఎం. రాజేశ్వరి, గణేశ్, రాజేందర్, మధు తహసీల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.