ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకప్ సజావుగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శనివారం న్యూ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం, వీవీ ప్యాట్ గోడౌన్ ను ఆయన సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఫస్ట్ లెవల్ చెకప్ లో పని చేయని ఈవీఎంలను రిపేర్కు పంపినట్టు చెప్పారు. అనంతరం గోడౌన్ లో ఫస్ట్ లెవల్ చెకప్ అనంతరం భద్రపర్చిన ఈవీఎం, వీవీ ప్యాట్ల గదుల తాళాలు, సీళ్లను కలెక్టర్ పరిశీలించారు.
సీసీటీవీ కెమెరాలు నిరంతరం పని చేసేలా చూడాలని చెప్పారు. భద్రతా సిబ్బందికి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ హుస్సేన్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి నల్లమోతు తిరుమలరావు, బీజేపీ ప్రతినిధి జీఎస్ఆర్ఏ విద్యాసాగర్, బీఆర్ఎస్ ప్రతినిధి చీకటి రాంబాబు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సింగు రాజయ్య, టీడీపీ ప్రతినిధి పాలడుగు టీఆర్ కృష్ణప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
స్టూడెంట్స్ కు అభినందనలు..
ఎంపీహెచ్ డబ్ల్యూ ఫలితాల్లో స్థానిక మహిళా ప్రాంగణం నుంచి రాష్ట్ర స్థాయిలో 2వ, 4వ ర్యాంకులు సాధించిన విద్యార్థులు బైరం రచన, సాలవాడి మణిని శనివారం కలెక్టర్ గౌతమ్ అభినందించారు. జిల్లా స్థాయిలో మొదటి పది ర్యాంకులు మహిళా ప్రాంగణం విద్యార్థులే కైవసం చేసుకోవడాన్ని ఆయన ప్రశంసించారు. విద్యార్థులు ఈ విజయాన్ని అందుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించిన జిల్లా ప్రాంగణం అధికారిణి వేల్పుల విజేతను అభినందించారు.
జాఫర్ బావి పునరుద్ధరణ పనుల పరిశీలన
ఖమ్మం సిటీలోని జాఫర్ బావి పునరుద్ధరణ, సుందరీకరణ పనులను కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి శనివారం పరిశీలించారు. రూ. 61.80 లక్షలతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మెట్ల మార్గాన్ని, లైటింగ్ ను ప్రారంభించారు.
ఓల్డ్ మున్సిపాలిటీ సందర్శన
పాత మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి శనివారం పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరిందన్నారు. పెవిలియన్ గ్రౌండ్ వద్ద ఉన్న జిల్లా గ్రంథాలయం ఇటీవల కూలిపోగా, ఆ స్థలంలో నిర్మించనున్న భవన నమూనాను కలెక్టర్ పరిశీలించారు. పాఠకులకు అన్ని వసతులతో భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.