అదనపు కలెక్టర్ కు ఆత్మీయ వీడ్కోలు: కలెక్టర్ గౌతమ్

ఖమ్మం టౌన్,వెలుగు: జిల్లా సమగ్రాభివృద్ధికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా స్నేహాలత మొగిలి అత్యుత్తమ సేవలు అందించారని జిల్లా కలెక్టర్  గౌతమ్ అన్నారు. బుధవారం ఐడీఓసీ  సమావేశ మందిరంలో  బదిలీపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా వెళ్లిన స్నేహలత మొగిలికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించి సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  జిల్లాకు మొదటి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా 3 సంవత్సరాలకు పైగా విశిష్ట సేవలు అందించారన్నారు.  

ప్రభుత్వ  కార్యక్రమాల అమలులో జిల్లా ఉన్నత స్థానంలో నిలవడంలో స్నేహలత పాత్ర ఎంతో ఉందన్నారు.  ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం పొంది వాటిపై నమ్మకం పెంచి మార్గదర్శకంగా నిలిచారని కలెక్టర్ కొనియాడారు.  ఈ సందర్భంగా  స్నేహలత మొగిలి మాట్లాడుతూ ఖమ్మంలో పనిచేయడం మంచి అనుభవమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, ఎన్. మధుసూదన్,  మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా,  అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.