- రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిబంధనలను పాటించాలి
కరీంనగర్, వెలుగు : జిల్లాలో కట్టుదిట్టంగా ఎన్నికల కోడ్‌ను అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కరీంనగర్ కలెక్టర్ డాక్టర్ బి.గోపి తెలిపారు. కలెక్టరేట్లో డీఐజీ కె.రమేశ్, సీపీ సుబ్బారాయుడు, కలిసి, కలెక్టర్ గోపి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు 14 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్స్, 14 మందితో సర్వేలైన్స్ టీమ్స్, 9 మందితో వీడియో సర్వేలైన్స్ టీమ్, ఐదుగురితో వీడియో వ్యూహింగ్ టీమ్స్, 19 మందితో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మీడియా మానిటరింగ్ కమిటీని, సీజ్ చేసిన డబ్బుపై తదుపరి చర్యల కోసం డీఆర్డీఓ, డీసీవో , డీటీఓతో టీం, ఎక్సైజ్, ఆర్టీఓ, ఐటీ, పోలీస్,రెవెన్యూ అధికారులతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ టీంలన్ని 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఈ- సువిధ అనే మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సోషల్ మీడియాపై గట్టి నిఘా ఉంటుందన్నారు. సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ జిల్లాలో 5 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఏఓ సుధాకర్, డీపీఆర్వో కలీం, డీఈఐఈ కొండయ్య
పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఈనెల 9 నుంచి రాజన్నసిరిసిల్లలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. సోమవారం ఎన్నికల షెడ్యూల్ , రూల్స్‌ను కలెక్టర్ మీడియాకు వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల అవుతుందని చెప్పారు.
ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలుచేసేందుకు ఇంటిగ్రేటెడ్కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. క్వాలిటీ రెస్పాన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలను 24 గంటల్లోగా, ప్రభుత్వ స్థలాలు స్థలాల్లోని రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లను, గోడలపై రాతలను 48 గంటల లోగా తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం, ఓటర్లను బెదిరించడం నేరమని కలెక్టర్ తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు
ఎన్నికల నిబంధన లు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం నుంచి జిల్లాలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ లను ఫార్వర్డ్ చేయవద్దని ఎస్పీ సూచించారు. మీడియా సమావేశంలో అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ఎన్.ఖీమ్యా నాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారి దశరథం పాల్గొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
గోదావరిఖని, వెలుగు : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని సీపీ రెమా రాజేశ్వరి సిబ్బందికి సూచించారు. సోమవారం కమిషనరేట్ ఆఫీస్‌లో పెద్దపల్లి, మంచిర్యాల పోలీస్ ఆఫీసర్లతో ఆమె రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసులు ఎన్నికల కమిషన్ఆదేశాలకు లోబడి పని చేయాలన్నారు. నిబంధనల ప్రకారం ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.
సీఐలు, ఎస్ఐలు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్‌లను విజిట్ చేయాలన్నారు. చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని, డబ్బు, మద్యం రవాణా విషయంలో అలర్ట్‌గా ఉండాలని సూచించారు. మీటింగ్‌లో డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సుధీర్ కేకన్, అడిషనల్ డీసీపీ (ఏఆర్) రియాజ్ హుల్ హాక్, ఏసీపీలు శ్రీనివాసరావు, మహేశ్, తిరుపతిరెడ్డి, మోహన్, సదయ్య, మల్లారెడ్డి, నరసింహులు,రాజేశ్, సుందర్‌రావు, మల్లికార్జున్, ఈవో నాగమణి పాల్గొన్నారు.