బ్యాంకర్లు ఈసీ రూల్స్ పాటించాలి: హమమంతు కొండిబా

యాదాద్రి, వెలుగు:  బ్యాంకర్లు ఎలక్షన్ కమిషన్ రూల్స్‌‌ పాటించాలని  కలెక్టరు హమమంతు కొండిబా ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్‌‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పాటించాలని, ఏటీఎంల్లో క్యాష్ రవాణా కోసం ఈఎస్‌‌ఎంఎస్‌‌ పోర్టల్లో లాగిన్ అవడంతో పాటు వెంట సంబంధిత పత్రాలు తెచ్చుకోవాలని సూచించారు. 

అనుమానాస్పద ఖాతాల లావాదేవీలపై అలర్ట్‌‌గా ఉండాలని, ఈనెల 9 నుంచి లక్షకుపైగా లావాదేవీలపై రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. రూ.10 లక్షలకు పైగా జరిగిన లావాదేవీల వివరాలు ఐటీ నోడల్ అధికారికి పంపిస్తామని చెప్పారు.  ఒక అకౌంట్ నుంచి అనేక అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేసిన వారి వివరాలు ఇవ్వాలన్నారు. అభ్యర్థి నామినేషన్ వేశాక కొత్త అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని,  సరిపడా చెక్ బుక్స్  ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.   

ఈ మేరకు ఎల్డీఎం బ్యాంకర్లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఆలేరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్‌‌‌‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌‌ కలెక్టర్ ఎ.భాస్కరరావు,  ఎల్‌‌డీఎం రామకృష్ణ,  ఎన్నికల విభాగం సూపరిండెంట్ నాగేశ్వరా చారి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.