ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధికి ప్లాన్​ రెడీ చేయండి : కలెక్టర్ ప్రావీణ్య

ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధికి ప్లాన్​ రెడీ చేయండి : కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ, వెలుగు: ఎల్కతుర్తి జంక్షన్ డెవలప్ మెంట్ తోపాటు వివిధ అభివృద్ధి పనులకు సమగ్ర ప్రణాళికను త్వరగా తయారు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ లో ఎల్కతుర్తి  జంక్షన్ నిర్మాణంతోపాటు వివిధ అభివృద్ధి పనులపై కుడా, రెవెన్యూ, మున్సిపల్, ఆర్టీసీ, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ సుందరీకరణ పనులకు ప్లాన్ ఉండాలన్నారు. అనంతరం కుడా, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములను సర్వే చేసి నివేదిక సమర్పించాలన్నారు.

నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు. నగరంలో 70కి పైగా ఉన్న చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. హనుమకొండ జిల్లా పరిధిలో ప్రభుత్వ భూముల సర్వే కొనసాగుతోందని, వాటికి సంబంధించిన వివరాలతో నివేదికను సమర్పించనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. సమావేశంలో గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో వెంకటేశ్, కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఆర్టీసీ ఆర్ఎం విజయ భాను తదితరులు పాల్గొన్నారు.