అప్రమత్తంగా ఉండండి : హునుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు: తుఫాన్ దృష్ట్యా రానున్న మూడు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ హనుమంతు కే.జెండగే ఆదేశించారు. మంగళవారం అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కరరావుతో కలిసి తహసీల్దార్లు, ఎండీపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్, రోడ్లు భవనాల శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సహాయక చర్యల కోసం కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్(నెంబర్ 08685- 293316)  ఏర్పాటు చేశామని  చెప్పారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని, పాత గోడలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలోని వారిని అప్రమత్తం చేయాలన్నారు. చెరువులకు గండ్లు పడే చోట్లను గుర్తించి, కల్వర్టులు, రోడ్లపై, బ్రిడ్జిలపై నీరు ప్రవహించే చోట్ల రాకపోకలకు అనుమతించవద్దని చెప్పారు.  

పోలీసులతో సమన్వయం చేసుకొని బ్యారికేడ్లు, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామాలలో, మున్సిపాలిటీ వార్డుల్లో ఇండ్ల మధ్య నీళ్లు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. మూసీ పరివాహక మండలాలైన బీబీనగర్, భువనగిరి, వలిగొండ, పోచంపల్లి, రాజంపేట పరిథిలోని గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలుగకుండా చూసుకోవాలని, అధికారులెవరూ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు.    క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ ప్రతి మూడు గంటలకు ఒక సారి నివేదికలు పంపాలన్నారు.