యాదాద్రి, వెలుగు : రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. శుక్రవారం భువనగిరి మండలం నందనం ఐకేపీ సెంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెంటర్లకు వస్తున్న వడ్ల నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి వెంటవెంటనే కాంటా వేయాలని, మిల్లులకు తరలించాలని సెంటర్ ఇన్చార్జిలను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుడా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 372 సెంటర్లలో ఇప్పటివరకు 9302 రైతుల నుంచి రూ.226 కోట్ల విలువైన 97,812 టన్నుల వడ్లను కొనుగోలు చేశామని వివరించారు. ఇప్పటివరకు రూ.76 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు.
అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్లకు రావాలి..
ఈనెల 17,18న గ్రూప్–3 పరీక్ష రాసే అభ్యర్థులు అరగంట ముందుగానే సెంటర్‌కు చేరుకోవాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన పరీక్ష సెంటర్‌ను ఆయన పరిశీలించారు. టీజీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ఏ–4 సైజ్‌లో కలర్ ఫ్రింట్ తీసుకోవాలన్నారు.
కుటుంబ సర్వేతో సమగ్ర ప్రణాళిక
ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కోసం ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బీబీనగర్‌లో నిర్వహిస్తున్న సర్వే తీరును ఆయన పరిశీలించి ఎన్యుమరేటర్లతోపాటు ప్రజలతో మాట్లాడారు. స్టేట్ లెవల్లో సర్వే నిర్వహిస్తున్నందున అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు.