
- కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, తాగునీరు, పన్ను వసూలు, ఎల్ఆర్ఎస్ పై మంగళవారం కలెక్టరేట్ లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మూడు జాబితాల్లోని కుటుంబాల వివరాలను పరిశీలించాలన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందేలా కృషి చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించిన ఎల్ఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైనవారు గడువులోపు తమ ప్లాట్లను రెగ్యులరైజ్చేసుకోవాలని సూచించారు. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పారు. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. కచ్చితంగా పన్ను వసూల్ చేయాలని, లేదంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, డీఆర్డీవో నాగిరెడ్డి , హౌసింగ్ పీడీ విజయసింగ్ తదితరులు పాల్గొన్నారు.