యాదాద్రి, వెలుగు : యాదాద్రి భువనగిరిని గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో గంజాయిపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పట్టుబడిన గంజాయి, నమోదైన కేసులు, సీజ్చేసిన వాహనాలు, పీడీ యాక్ట్ నమోదు వివరాలను డీసీపీ రాజేశ్చంద్ర, ఎక్పైజ్ఎస్పీ సైదులు వివరించారు. ఏఏ రూట్ల మీదుగా గంజాయి రవాణా జరుగుతుందో తెలిపారు.
గంజాయిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ యువత, విద్యార్థులను గంజాయి, ఇతర మత్తు పదార్థాల బారిన పడకండా కాపాడాలన్నారు. గంజాయి అమ్మేవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్కూల్స్, కాలేజీలు ఉన్న చోట ఎక్కువగా ఫోకస్ పెట్టాలన్నారు. గంజాయి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాల గురించి యువత, స్టూడెంట్స్కు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా మీదుగా సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి రాకుండా గట్టి నిఘా పెంచాలని ఆదేశించారు. మీటింగ్లో అడిషనల్ కలెక్టర్లు గంగాధర్, వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, డీపీవో సునంద పాల్గొన్నారు.