యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం యాదగిరిగుట్టలో దేవస్థానం ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ చేపట్టారు. ఉదయం 5 గంటలకు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భాస్కర్ రావు వైకుంఠ ద్వారం వద్ద ఉన్న స్వామివారి పాదాలకు ప్రత్యేక పూజలు చేసి సామూహిక గిరిప్రదక్షిణ ఆరంభించారు.
హైదరాబాద్ 'భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్' కు చెందిన దాదాపుగా 2 వేల మంది బృందం సభ్యులు.. భక్తిగీతాలు, భజనలు, సంకీర్తనలు ఆలపిస్తూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం కాలినడకన కొండపైకి వెళ్లి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని తరించారు. గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు ఆలయ ఆఫీసర్లు ఉచితంగా స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి, స్వామివారి లడ్డూప్రసాదం అందజేశారు.
ఆలయంలో స్వాతినక్షత్ర పూజలు..
లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతినక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయంలో స్వామివారికి నిత్య కైంకర్యాలు ముగిసిన అనంతరం అష్టోత్తర శతఘటాభిషేకం చేపట్టారు. ప్రధానాలయ ముఖ మంటపంలో 108 కలశాలను వరుస క్రమంలో పేర్చి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలశాలలో మంత్రపూరితమైన జలంతో లక్ష్మీనారసింహులను అభిషేకించారు. కార్యక్రమంలో అర్చకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.