
- కలెక్టర్ హనుమంతరావు
- యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు
యాదగిరిగుట్ట, వెలుగు: ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. శనివారం యాదగిరిగుట్ట జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి ఎగ్జామ్సెంటర్ను సందర్శించారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ధరణిపై రెవెన్యూ అధికారులతో రివ్యూ చేశారు. సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే సహించబోమన్నారు.
దీనిపై సమాచారం తెలిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. గృహావసరాల పేరిట పర్మిషన్ తీసుకొని, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే.. సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పేపర్ వర్క్ మాత్రమే చేసి, ప్రతిపాదనలు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య రాకుండా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ముందు జాగ్రత్తగా రైతులతో మాట్లాడి, లీజ్పద్ధతిలో బోర్లను వాడుకోవడానికి ఒప్పందాలు చేసుకున్నామన్నారు. వాటర్ డిమాండ్ పెరిగి, మిషన్ భగీరథ నీరు సరిపోకపోతే.. ఈ బోర్లను వినియోగంలోకి తెస్తామని పేర్కొన్నారు.
తప్పు చేశాడని తేలితే కారోబార్ పై చర్యలు
జంగంపల్లి కారోబార్ నెహ్రూపై భూముల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతోందని, తప్పు చేశాడని తేలితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అతను పహణీ ట్యాంపర్ చేసి, రైతుల భూములను తన పేరిట మార్చుకున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామన్నారు.