సంస్థాన్ నారాయణపురం, వెలుగు : గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల పట్ల టీచర్లు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హనుమంత్ జెండగే హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలోని బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. హౌజ్ మాస్టర్ వరుస సెలవులపై ప్రిన్సిపాల్ ను అడుగగా, ఆయన సరైన సమాధానం చెప్పకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు.
పాఠశాలలోని స్టోర్ రూమ్ ను ఆయన పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి పలు సబ్జెక్టులపై ప్రశ్నలను సందించారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, అంగన్వాడీ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్కృష్ణ, ఎంపీడీవో ప్రమోద్ కుమార్, ఎంపీవో జనార్దన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఆర్ఐ పాండు తదితరులు ఉన్నారు.