- కలెక్టర్ హనుమంతు కే.జెండగే
యాదగిరిగుట్ట, వెలుగు : అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం కోసమే ప్రభుత్వం డిజిటల్ కార్డు సర్వే చేపట్టిందని కలెక్టర్ హనుమంతు కే.జెండగే అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో జరుగుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే తీరును శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి తప్పులు జరగకుండా డిజిటల్ సర్వే పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు, జండర్, పుట్టిన తేది, వయస్సు, కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధం, ఆధార్ నంబర్, అడ్రస్ వంటి వివరాల్లో ఏ ఒక్కటీ మిస్ కాకుండా నమోదు చేయాలని సూచించారు. సర్వే చేయడానికి నియమించిన బృందాలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. యాదగిరిగుట్ట 8వ వార్డులో 210 కుటుంబాలు ఉన్నాయని, ఇందులో 65 కుటుంబాల సర్వే కంప్లీట్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ దేశ్యానాయక్, కౌన్సిలర్ మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటిని కవర్ చేయాలి
నల్గొండ అర్బన్, వెలుగు : కుటుంబ డిజిటల్ కార్డు సర్వేలో ప్రతి ఇంటిని కవర్ చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ డిజిటల్ కార్డు సర్వేలో భాగంగా శుక్రవారం నల్గొండ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు కేశరాజుపల్లి, హ్యాపీ హోమ్స్ లో అధికారులు ఇంటింటికీ వెళ్లి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సర్వే ప్రక్రియను కలెక్టర్పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేస్ డేటా ఆధారంగా సర్వే నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇంటిని వదిలిపెట్టకూడదన్నారు. ఏ రోజు డేటాను ఆ రోజే నమోదు చేయాలని చెప్పారు. నిర్దేశించిన సమయానికి సర్వే పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, ఎంపీడీవో, అధికారులు తదితరులు పాల్గొన్నారు.