ఏది పని చేయకున్నా.. మార్చాలి : కలెక్టర్​ హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : పోలింగ్​జరుగుతున్న సమయంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లలో ఏ ఒక్కటి పని చేయకున్నా వాటిని వెంటనే మార్చాలని జిల్లా ఎన్నికల ఆఫీసర్, కలెక్టర్​ హనుమంతు జెండగే సూచించారు.  వాటిని మార్చిన తర్వాత తిరిగి మాక్​ పోలింగ్​ నిర్వహించాల్సి ఉంటుందన్నారు.  భువనగిరిలో పోలింగ్ విధానం, ఈవీఎం పనితీరుపై బుధవారం పీవోలు, ఏపీవోలకు నిర్వహించిన ట్రైనింగ్‌‌‌‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను అమర్చడంతో పాటు మాక్ పోలింగ్ నిర్వహణ గురించి వివరించారు.  మాక్​ పోలింగ్​ సమయంలో కనీసం 50 ఓట్లు వేయాల్సి ఉంటుందన్నారు.

ఈవీఎంల్లో క్లోజ్, రిజల్ట్‌‌‌‌, క్లియర్ వ్యవస్థలతో పాటు వీవీప్యాట్‌‌‌‌లో 7 సెకన్లలో వచ్చే స్లిప్స్ పై కచ్చితంగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలింగ్​ జరిగే సందర్భంలో కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్లలో ట్రబుల్ షూట్స్ తెలుసుకోవాలని అన్నారు. అడిషనల్​ కలెక్టర్ ఏ భాస్కరరావు, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్స్ ప్రిసైడింగ్,  అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు.  

ప్రజల్లో భరోసా కల్పించేందుకే ఫ్లాగ్ మార్చ్

యాదగిరిగుట్ట, వెలుగు : ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని కలెక్టర్ హనుమంతు జెండగే తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సమస్యాత్మక గ్రామాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెప్పారు.  

పోలింగ్ సమయంలో కేంద్ర బలగాలు కీలక పాత్ర పోషిస్తాయని, సమస్యాత్మక సెంటర్ల వద్ద సాయుధ బలగాలు, బీఎస్ఎఫ్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ వీరారెడ్డి, డీసీపీ రాజేష్ చంద్ర, ఏసీపీ శివరాంరెడ్డి, సీఐలు రమేష్, సురేందర్ రెడ్డి, ఎంపీడీవో ప్రభాకర్ రెడ్డి, ఆర్ఐ విజయసేనారెడ్డి, విలేజ్ సెక్రటరీ రోజా, పోలీసులు పాల్గొన్నారు.