యాదాద్రి, వెలుగు: భగవద్గీతను బంజారా భాషలో రాయడం గొప్ప విషయమని కలెక్టర్ హనుమంతు జెండగే అన్నారు. ఈ విషయంలో కేతావత్ సోమ్‌లాల్ చాలా సమర్థుడని ఆయన కొనియాడారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావి తండాకు చెందిన సోమ్లాల్ను పద్మశ్రీ వరించడంతో ఆదివారం ఆయన్ని ఘనంగా సన్మానించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బంజారా భాషలో భగవద్గీత 700 శ్లోకాలు రాయడం ఆయన సమర్థతకు నిదర్శనమన్నారు. సోమ్‌లాల్ నాయక్ కు పద్మశ్రీ అవార్డు రావడం రాష్ట్రంలోని గిరిజన లంబాడీ ప్రజలకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. డీసీపీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. గిరిజన కుటుంబంలో పుట్టిన సోమ్‌లాల్ అంచెలంచెలుగా ఎదిగి నేడు పద్మశ్రీ అవార్డు సాధించడం యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు.
పద్మశ్రీ సోమ్‌లాల్ నాయక్ మాట్లాడుతూ.. మా ముత్తాత, తాత, తండ్రి.. అందరూ వ్యవసాయం చేసుకుంటూ ఊరికి దూరంగా నివసించే వారమన్నారు. గిరిజన భాషలో భగవద్గీత సాహిత్యం రాయడంతో ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కళాశ్రీ మెగావత్ భిక్షు నాయక్, టీకం నాయక్, యువజన సంఘం అధ్యక్షుడు కేతావత్ తిరుపతి నాయక్, తేజావత్ కుమార్, తేజావత్ కృష్ణ, తేజావత్ ప్రవీణ్, కె. రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.