- కలెక్టర్లు హరిచందన, ఎస్.వెంకట్రావు, పల్నాడు జిల్లా కలెక్టర్ శివ
మిర్యాలగూడ, వెలుగు : లోక్ సభ ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్లు హరిచందన, ఎస్.వెంకట్రావు, పల్నాడు జిల్లా కలెక్టర్శివ అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ జిల్లా వాడపల్లి ఇండియా సిమెంట్ వద్ద జిల్లాల ఎస్పీలతో కలిసి లోక్ సభ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ నల్గొండ –పల్నాడు జిల్లాల అంతర్ రాష్ట్ర సరిహద్దులో 3 చెక్ పోస్ట్ లు, నల్గొండ-, సూర్యాపేట జిల్లాల సరిహద్దుల్లో 7 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
7 చెక్ పోస్ట్ ల్లో 24 గంటలు అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. జిల్లాలో రూ.4.5 కోట్ల విలువైన నగదు, మద్యం, విలువైన ఆభరణాలను సీజ్ చేసినట్లు చెప్పారు. ప్రధానంగా నాగార్జునసాగర్ చివరి ఆయకట్టు ఏరియాలో నిఘా పెట్టాలన్నారు. సూర్యాపేట కలెక్టర్ ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని, కోడ్ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
అవసరమైన సమాచారం నిమిత్తం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నల్గొండ, సూర్యాపేట, పల్నాడు ఎస్పీలు చందనాదీప్తి, ఎస్పీ రాహుల్ హెగ్డే, రవిశంకర్ మాట్లాడుతూ చెక్ పోస్ట్ ల వద్ద పటిష్టి నిఘా పెట్టామని చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాడపల్లి రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ తనిఖీ చేశారు. సమావేశంలో నల్గొండ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ పాల్గొన్నారు.