- కలెక్టర్ హరిచందన దాసరి
నల్గొండ అర్బన్, వెలుగు : వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్, పండ్లు, కూరగాయలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌తో కలిసి వ్యవసాయ, మత్స్య శాఖ, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాబార్డ్ ద్వారా వ్యవసాయ సంబంధ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లకు లోన్లు ఇప్పించి యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు సరిపడా ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు..
ఏఈవోలు క్రాప్ బుకింగ్ యాప్‌లో పంటలతో పాటు ఫెర్టిలైజర్ స్టాక్ వెరిఫికేషన్ వివరాలు కూడా నమోదు చేయాలని ఆదేశించారు. మత్స్య శాఖ ద్వారా అన్ని నియోజకవర్గాల్లో చేపల మార్కెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, రీసర్క్యూలేటరీ అక్వా సిస్టం యూనిట్లు ఏర్పాటు చేసే వారికి ప్రోత్సాహం అందించాలని ఆదేశించారు. అనంతరం ఎక్సైజ్ అధికారుల సమీక్షలో మాట్లాడుతూ.. మద్యం అక్రమ రవాణా నిరోధించేందుకు చెక్ పోస్టుల్లో నిఘా పెంచాలని ఆదేశించారు.
అభివృద్ధి పనుల పరిశీలన
పట్టణంలోని ఐటీ టవర్, జంక్షన్లు, ప్రతిపాదిత పుడ్ బజార్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, బీట్ మార్కెట్ వద్ద రైతు బజార్‌ను శుక్రవారం కలెక్టర్ హరిచందన పరిశీలించారు. అలాగే ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలని పరిశీలించి.. స్విమ్మింగ్ పూల్‌కు రిపేర్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇండోర్ స్టేడియంలో వివేకానంద జయంతి సందర్భంగా తైక్వాండో, బ్యాడ్మింటన్, అవుట్ డోర్ స్టేడియంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తుండగా.. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పల పల్లి లోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్‌లో పార్లమెంట్ ఎన్నికల ప్రతిపాదిత కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించారు.
ఆయా కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్, మత్స్య శాఖ అధికారి వెంకయ్య, వ్యవసాయ శాఖ ఏడీలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు, ఆర్డీవో రవి, పంచాయతీ రాజ్ ఎస్ఈ తిరుపతయ్య, ఈఈ భూమన్న, పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, తహశీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.