మనబడి పనులు స్లో.. 368 బడుల్లో పూర్తయినవి 33

  • ఫండ్స్​కు కొదువ లేదంటున్న కలెక్టర్​
  • నెలన్నరగా బిల్లులు రావడం లేదంటున్న కాంట్రాక్టర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో  మన ఊరు– మన బడి పనులు  ముందుకు సాగడం లేదు.  జిల్లాలో 368 స్కూళ్లలో పనులు చేపట్టగా కేవలం 33 స్కూళ్లలోనే పనులు పూర్తయ్యాయి.  ‘నిధులకు కొదువ లేదు. పనులు పూర్తి చేయండ’ అని కలెక్టర్​ అంటున్నా  బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు.    పనుల్లో వేగం పెంచాలని పలుమార్లు కలెక్టర్​ ఆఫీసర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించినా ఆయన మాటలను పెడచెవిన పెడుతున్నారు.  

రూ . 41కోట్లు ఖర్చు చేసినా పనుల్లో నత్త నడకే.. 

మన ఊరు_ మన బడి స్కీంలో భాగంగా జిల్లాలో గతేడాది మే, జూన్​ నెలలో పనులు ప్రారంభం అయ్యాయి. జిల్లాలోని 1064 స్కూల్స్​కు గానూ మొదటి దశలో 368 స్కూల్స్​ను ఆఫీసర్లు సెలెక్ట్​ చేశారు. ఈ స్కూళ్లలో పనులకు  రూ. 91 కోట్లను కేటాయించారు. ఏడాది కాలంలో 368 బడులకు గానూ కేవలం 33  బడుల పనులు పూర్తి అయ్యాయి. ఇందులో 28 స్కూళ్లను అధికారులు ప్రారంభించారు. మొదటి దశలో  సెలక్ట్​ చేసిన వాటిలో  64 హైస్కూల్స్​ ఉన్నాయి. ఇందులో ఒక్క  బడిలోనే పూర్తి స్థాయిలో పనులు  పూర్తి కాలేదు.  జిల్లాలోని పాల్వంచ మండలంలో 24 స్కూల్స్​కు గానూ కేవలం రెండు స్కూల్స్​, లక్ష్మీదేవిపల్లి మండలంలో 16 స్కూల్స్​కు గానూ రెండు బడుల్లో  మాత్రమే పనులు పూర్తి అయ్యాయి. ఇదిలా ఉండగా..  మన ఊరు_మన బడి స్కీంకు ఫండ్స్​ కొరత లేదని కలెక్టర్​ పదే పదే చెప్తున్నా పనులు స్లోగా జరుగుతున్నాయి.  

రూ. 91కోట్లకు గానూ ఇప్పటి వరకు దాదాపు రూ. 41కోట్ల నిధులను ఆఫీసర్లు రిలీజ్​ చేశారు. నిధులు  రిలీజ్​ అవుతున్నా పనులు సరిగ్గా చేయడం లేదు.  పలు హైస్కూళ్లలో  చేపట్టిన డైనింగ్​ హాల్స్​ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వర్షం పడితే  అన్నం తినేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు.  చేసిన పనులకు సంబంధించి దాదాపు రూ. 4కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. దాదాపు నెలన్నరగా బిల్లుల కోసం ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నామని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. కాగా పనులపై ఇంజినీరింగ్​ ఆఫీసర్ల పర్యవేక్షణ సక్కగా లేకపోవడంతో పలు చోట్ల పనులు నాసిరకంగా సాగుతున్నాయని పలువురు స్కూల్​ హెచ్​ఎంలు పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల సర్పంచ్​లు, వారి అనుచరులే పనులు చేస్తుండడంతో ఏమి అనలేకపోతున్నామని  వాపోతున్నారు.