
వీణవంక, వెలుగు: భూభారతి చట్టంలోని రెండంచెల అప్పీలు వ్యవస్థతో రైతులకు మేలు జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వీణవంక మండలం మండలం చల్లూరు రైతువేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా ప్రతి గ్రామంలో నాలుగు రకాల రికార్డుల నిర్వహణ ఉంటుందని, భూముల వివరాలు ప్రతిఒక్కరికీ కనిపిస్తాయన్నారు. కొత్త చట్టంలో తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌కు అధికారాలు ఇవ్వడంతో ఏ స్థాయిలోనైనా రైతుల సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయన్నారు. మనిషికి ఆధార్ లాగే భూమికి భూదార్ కార్డును జారీ చేయనున్నట్లు చెప్పారు. సదస్సులో ఆర్డీవో రమేశ్, ఏడీ సునీత, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీధర్, ప్యాక్స్ చైర్మన్ విజయ భాస్కర్‌రెడ్డి, వైస్ చైర్మన్ గాజుల మేరీ, ఏవో గణేశ్, ఏఈవోలు పాల్గొన్నారు.
పక్కాగా భూహద్దులు
జగిత్యాల టౌన్, వెలుగు: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం మేడిపల్లి మండలంలో రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులు పారదర్శకత జవాబుదారీతనంతో పనిచేసేలా ఈ చట్టంలో రూపొందించారన్నారు. భూభారతి ద్వారా పక్కగా భూ సరిహద్దులు నిర్ణయిస్తారని, రైతులకు, భూ హక్కుదారులకు ఉచిత న్యాయం అందుబాటులో ఉంటుందన్నారు. వారసత్వం, వీలునామా ద్వారా భూమిపై హక్కుల సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ చేసి రికార్డుల్లో మ్యుటేషన్ చేస్తారని, 30రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికాకపోతే, ఆటోమెటిక్‌గా మ్యుటేషన్ జరుగుతుందన్నారు. అనంతరం మేడిపల్లి మండలం కొండాపూర్, కాచారం గ్రామాల్లోని కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, మేడిపల్లి తహసీల్దార్ వసంత, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తప్పుల సవరణకు అవకాశం
రాజన్న సిరిసిల్ల, వెలుగు: భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి చట్టంపై సోమవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భూభారతి చట్టంలోని అంశాలను వివరించారు. భూహక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉందని, భూముల మ్యాప్ జియో ట్యాగింగ్‌తో పాస్ బుక్కులు జారీ చేస్తామని వివరించారు.
అంతకుముందు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన ప్రజల నుంచి 209 అప్లికేషన్లు స్వీకరించినట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో లైబ్రరీ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపరెడ్డి, ఆర్డీవో రాధాబాయి, ఇన్‌చార్జి తహసీల్దార్ విజయ్ భాస్కర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.