ప్రత్యేక ప్రజావాణి అర్జీలపై దృష్టి పెట్టాలి : ఇలా త్రిపాఠి

 ప్రత్యేక ప్రజావాణి అర్జీలపై దృష్టి పెట్టాలి : ఇలా త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 
  • 74 మంది దివ్యాంగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

నల్గొండ అర్బన్, వెలుగు: వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి వచ్చిన అర్జీలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం నల్గొండ కలెక్టరేట్​సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో 74 మంది దివ్యాంగుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో జారీ చేసిన సదరం సర్టిఫికెట్లను ప్రీ అసెస్​మెంట్ చేయించాలని, పెన్షన్లు మంజూరు చేయాలని సూచించారు. 

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కొందరు, ఇల్లు మంజూరు చేయాలని ఇంకొందరు, తమ పిల్లల నుంచి పోషణ భత్యం ఇప్పించాలని పలువురు వృద్ధులు కోరారు. దివ్యాంగులు ప్రతినెలా పెన్షన్​తీసుకోవాలని ,3  నెలలకు మించి తీసుకోకపోతే ఆగిపోతుందని కలెక్టర్​ తెలిపారు. దరఖాస్తుపై స్పెషల్ గ్రీవెన్స్ అని రాస్తే త్వరగా పరిష్కరించాలని అధికారులకు చెప్పారు. ఆర్డీవోలు తహసీల్దార్లకు ఇలాంటి ఆదేశాలు జారీ చేయాలన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్​చార్జి డీఆర్​వో అశోక్ రెడ్డి, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్​కుమార్ పాల్గొన్నారు. 

ఎగ్జామ్ ​సెంటర్​లోకి ఇతరులను అనుమతించొద్దు

హాలియా, వెలుగు: మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టెన్త్​ఎగ్జామ్​సెంటర్​ను శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లో సెంటర్​లోకి ఇతరులను అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు.  ఎంఈవో కృష్ణమూర్తి పాల్గొన్నారు.