
నల్గొండ అర్బన్, వెలుగు : రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సోమవారం మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంసీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సరీల్లో ముందుగా బ్యాగుల్లో మట్టి నింపడాన్ని పూర్తిచేయాలని, షెడ్ నెట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మొక్కల పెంపకానికి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని చెప్పారు.
నర్సరీల్లో ఏ మొక్కలు ఎంత శాతం పెంచాలో ఆ మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. డీఆర్ డీవో శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో 69 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల జాబితా పరిశీలనపై సమీక్షించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 25 దరఖాస్తులు
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సకాలంలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్ తో కలిసి ఆమె స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 25 దరఖాస్తులు వచ్చాయి. స్వీకరించిన వాటిలో కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధితశాఖ అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ డీఏ పీడీ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.