తాగునీటి సరఫరాలో అవాంతరాలు ఉండొద్దు : కలెక్టర్ ఇలా త్రిపాటి

తాడ్వాయి, వెలుగు : వేసవికాలంలో నీటి సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి తాగునీరు సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి ఇబ్బందులను గుర్తించడానికి ప్రతి గ్రామ పంచాయతీకి సూక్ష్మప్రణాళిక( మైక్రో ప్లాన్ ) తయారు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తక్కువ నీరు వచ్చే ప్రాంతాలను ( టైయిల్ ఎండ్)గుర్తించాలన్నారు.

వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో ఎన్ని చేతిపంపులు పనిచేస్తున్నాయి? రిపేరింగ్ దశలో ఉన్న వాటికి సంబంధించిన ప్రోగ్రెస్ ఉండాలన్నారు. త్వరగా చేతిపంపులకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. రాబోయే మూడు నెలల్లో గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు అందించాలని అధికారులు ఆదేశించారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోషణ్​ పక్షోత్సవంలో కలెక్టర్ పాల్గొన్నారు.

కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డీఎండీఎం హెచ్ వో అల్లెం అప్పయ్య, ఆర్ బ్ల్యూఎస్ సీఈ శ్రీనివాసరావు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ మల్లేశం, ఆర్ బ్ల్యూఎస్ ఈఈ మాణిక్యరావు, ఎన్పీడీసీఎల్ డీఈ నాగేశ్వరరావు, డీడబ్ల్యూవో స్వర్ణలత అధికారులు తదితరులు పాల్గొన్నారు.