
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : యాసంగి ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం నల్గొండ కలెక్టరేట్ లో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైస్ మిల్లర్ల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకు పెండింగ్ ట్రాన్స్ పోర్ట్ బిల్లుల చెల్లింపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.1400 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిగతా బిల్లులను ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తోందని, అప్పటివరకు వేచి ఉండాలని కోరారు. పాత గన్ని బ్యాగులకు సంబంధించిన సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
రైస్ మిల్లులవారీగా పాత గన్నీ బ్యాగుల సమాచారాన్ని సేకరించాలని ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్, ఇన్చార్జి డీఎస్ వో హరీశ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రావణ్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, భద్రాద్రి పాల్గొన్నారు.