![ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం : కలెక్టర్ ఇలా త్రిపాఠి](https://static.v6velugu.com/uploads/2025/02/collector-ila-tripathi-conducted-training-for-returning-officers-of-gram-panchayat-elections-at-collectorate_A50URJqeHG.jpg)
నల్గొండ అర్బన్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో గ్రామ పంచాయతీ ఎన్నికల స్టేజీ 1, 2 రిటర్నింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దని, ఎన్నికల నియమ, నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించాలన్నారు.
ఎన్నికల్లో ఎలాంటి పక్షపాతానికి, బంధుప్రీతికి తావులేకుండా పనిచేయాలని సూచించారు. ఎవరైనా పొరపాట్లు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది నేరుగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలని సూచించారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణతోపాటు అన్ని అంశాలపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఏమైనా సందేహాలు ఉంటే ఎన్నికల అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని తెలిపారు.