
- కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి.
నల్గొండ, వెలుగు : వరంగల్,- ఖమ్మం, -నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం రాష్ర్ట ఎన్నికల అధికారి టీచర్ఎమ్మెల్సీ ఎన్నికలపై నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
నల్గొండ జిల్లాకు సంబంధించి 37 ఉన్నాయని, ఇందుకు 50 మంది ప్రిసైడింగ్ అధికారులు,50 మంది పోలింగ్ అధికారులను నియమించి శిక్షణ ఇచ్చామని తెలిపారు. 22,439 ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులకు 3,358 వరకు పంపిణీ చేశామని, ఈనెల 25లోపు పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికలకు జంబో బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నామని తెలిపారు. 28 వేల బ్యాలెట్ పేపర్లను ఈ ఎన్నికల్లో వినియోగిస్తామన్నారు. కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్కలెక్టర్ జె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పని చేయాలి..
జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్లో జిల్లా వైద్యారోగ్యశాఖ, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులతో మాతా, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతా, శిశు మరణాలు సంభవించడానికి గల కారణాలను వైద్యాధికారులు విశ్లేషించుకోవాలని చెప్పారు.
జిల్లాలో మాత ,శిశు మరణాలను అరికట్టడంలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలది కీలకపాత్ర అని పేర్కొన్నారు. సమావేశంలో డీఎంహెచ్ వో డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ఐసీడీఎస్పీడీ కృష్ణవేణి, డిప్యూటీ డీఎం హెచ్ వో వేణుగోపాల్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.