ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి : ఇలా త్రిపాఠి

ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి : ఇలా త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని, నిరంతరం తనిఖీలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో ఇసుక అక్రమ రవాణా నివారణ, తాగునీటి సమస్యపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మైనింగ్, ఇరిగేషన్, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ రీచ్ నుంచి ప్రభుత్వం అనుమతించిన వారికి మాత్రమే ఇసుకను తీసుకెళ్లే అధికారం ఉందని, ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఇసుక రీచ్ ల వద్ద నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. రీచ్​ల వద్ద డ్రోన్ సర్వే చేస్తామని, పరిమితికి మించి ఇసుకను తవ్వినట్లయితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్తగా గుర్తించిన ఇసుక రీచ్ లను ఎంపీడీవోలు, తహసీల్దార్లు సంయుక్తంగా సందర్శించి వారంలోగా పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల నుంచి కొన్ని ఇసుక రీచుల ద్వారా అనుమతి లేకుండా రవాణా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. 

జిల్లాలో 24 రీచ్ ల్లో ఇసుకను తీసేందుకు అనుమతి ఉంటుందని, వాటిని బలోపేతం చేస్తామన్నారు. ప్రతి రీచ్ ను ఎంపీడీవో ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. నది లోతట్టు ప్రాంతంలో ఇసుక తవ్వడానికి వీలులేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జాయింట్ టీంను ఏర్పాటు చేశామన్నారు. 

ఈ టీం సభ్యలు ఇసుక రీచ్​లను ఎప్పటికప్పుడు సందర్శించాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా మైన్స్ శాఖ సహాయ సంచాలకుడు జాకబ్, గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్ కుమార్, మిషన్ భగీరథ ఈఈ వంశీకృష్ణ, డీఎస్పీలు, ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు. 

సమగ్ర వ్యవసాయ పద్ధతులను పాటించాలి 

హాలియా, వెలుగు : రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులను పాటించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం త్రిపురారం మండలం కంప సాగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక దిగుబడులు నిచ్చే వంగడాలను సాగు చేయాలని రైతులకు సూచించారు.